Tuesday, July 22, 2008

మన తల్లి అన్నపూర్ణ!



Philadephia museum of art లో ఉన్న 'అన్నపూర్ణ ' ఇది. చిత్రకారుడు మన వంగ దేశస్తుడైన నందలాల్ బోస్. ఈ చిత్రాన్ని ఏ ఉద్దేశంతో అతడు వేశాడో అంతుపట్టలేదు కాని, చూసిన వెంటనే మనసు కలవర పడటం సహజం. కనిపించేది శివుడేనా? కరువుకాటకాలకు నిలయం లా ఉన్న బక్క చిక్కిన శరీరం తో అట్టలు కట్టిన జెడల సాంబశివుడేనా?

ఆకలి రాజ్యం లో పాట వెంటనే స్ఫురణ కొచ్చింది.

మన తల్లి అన్నపూర్ణ..(కనిపిస్తూనే ఉంది)
మన అన్న దాన కర్ణ..( సినిమా లో ఉద్దేసించినది NTR నే ఐనా), ఇక్కడ మాత్రం ఆ అపర దాన కర్ణుడు శివుడిలా లేడు? దానాలు చేసి, చేసి చేతికి యముక లేకుండా కృంగిపోయిన శరీరం తో? real concept behind this amazing painting ఏమయ్యి ఉంటుందా అన్ని చాలా ఆలోచించాను. ఈ చిత్రానికి అసలు స్ఫూర్తి తరువాత తెలిసి వచ్చింది.

శివుడు మన దేశానికి ప్రతీక. Annapurna means 'abundance'. India is (should I say 'was'??)a country that had everything in abundance (including population ofcourse!)

పాడి పంటలతో తులతూగే పచ్చని దేశం మనది. ఎందరో ప్రభువుల లాలనలో ఎనలేని కీర్తి ప్రతిష్టలతో విజయకిరీటాన్ని కొన్ని వేల సంవత్సరాలు నిర్విరామంగా తలకెత్తుకొని ప్రపంచానికే ఒక వన్నెగా నిలిచింది.తన ఘన చరిత్రను, సాహిత్య సౌరభాలను, ధన ధాన్యాది అపూర్వ సంపదలను ఏడువారాల నగలుగా ధరించి యావత్ ప్రపంచానికే అన్నపూర్ణ దర్శనమిచ్చింది.

మనిషి లోని స్వార్ధం ఊరుకోదు కదా? పండున్న చెట్టుకే రాయి అని...ఈ సహజ సంపదను దోచుకోవటానికి ప్రయత్నించాడు.వ్యాపారం పేరిట దేశంలోకి చొరబడి , తల్లిలా ఆదరించిన భరత మాత ను కొల్లగొట్టారు. సంపదలు దోచుకుపోయారు.

అడిగినది లేకుండా దానం చేసిన దేశంగా శివుడి శరీరాన్ని చూపించాడు బోస్.సాక్షాత్తు అన్నపూర్ణా దేవి నెలవున్న దేశం గతే తెల్లదొరల పుణ్యమా అని ఇంత దయనీయంగా ఉన్నది- అని ఈ చిత్రం ద్వారా బోస్ తన ఆవేదన వ్యక్తపరచాడు.

recent గా వచ్చిన food crisis వార్తలు, విమర్శలు తల్చుకుంటే, ఈ చిత్రాన్ని వాళ్ళాకి చూపించాలనిపించింది. ఎవరు ఎక్కువ తింటున్నారో, ఎవరు ఆకలి తో మాడుతున్నారొ.. స్పష్టం గా తెలియవస్తుంది.

ఏది ఏమైనా బియ్యానికి ఇంత పోకాలం వస్తుందని కలలో కూడా అనుకోలేదు. నిజంగానే డబ్బులు చెట్లకి కాస్తే బావుండు.

Thursday, July 3, 2008

గుర్తింపు కావాలి





ఊరకరారు మహానుభావులు అని .. ఒక కారణానికై పుట్టి, అది నెరవేర్చి, తిరిగి వచ్చిన చోటికే వెళ్తూ, అశేష ప్రజల ఆదరాభిమానాలని త్రుప్తిగా పొంది ,చిరస్మరణీయులుగా చరిత్రలో చెరగని ముద్ర వేసుకొని, తమకంటూ ఒక చిన్న column ఏర్పరచుకొని వినీలాకాశం లో తారలై నిల్చిపోయారు మన అభిమాన నటులెందరో!

గత రెండేళ్ళలో గొప్ప నటీనటులు అనతి కాలం లోనే తెలియకుండానే కనుమరుగయ్యారు. మనలో చాలా మందిని దుఖసాగరంలో ముంచివేశారు. ఒక లక్ష్మీకాంత రావు, ఒక శొభన బాబు, ఒక మల్లికార్జున రావు, ఒక కల్పనా రాయి, ఐరన్ లెగ్ శాస్త్రీ, సాక్షిరంగారావు, ఇలా ఎందరో.. వారు వచ్చిన పనిని ముగించి మనందరి అభిమానాన్ని సంపాదించుకొని తారలై వెలుగుతున్నారు, వెలుగుతూనే ఉంటారు !!

జీవితం బుద్బుదప్రాయం..నీటి బుడగ వంటి వేదాంత ధొరణి తెగ వింటూ ఉంటాం రోజు..హటాత్తుగా పోయినప్పుడు అయ్యో, పోయారు అనుకోవటం, ఎవరికి చేతనైనంత పరిధిలో వారు నివాళులు అర్పించటం మామూలే.

పోయిన మనిషి కనుక ఇదంతా చూస్తుంటే ' ఆ నలుగురు' సినిమాలోలాగా..బతికుండగా నాకు, నా కళ కు, తగిన గుర్తింపు ఇవ్వని ప్రజ, ప్రభుత్వం, కనీసం ఇప్పుడైనా నన్ను చూడటానికి, నాలుగు కన్నీటి బొట్లు రాల్చటానికి, వచ్చారు అని త్రుప్తి పడతాడేమో?

హాస్యానికన్నా అది పచ్చి నిజం. వీరిలో ఎంతో మందికి సరైన గుర్తింపు లేదు. సరైన పారితోషికం లేదు. అవార్డులు, రివార్డులు లేవు. ఇకపై వస్తాయో లేదో తెలియదు. తెలుగు మాట్లాడటం కూడా రాని నూతన నటీనటులకు ఎక్కడలేని పబ్లిసిటీ, అక్కర్లేని మర్యాదలు, గోరోజనాలు! ఉదాహరణకి నవరస నటనా సార్వభౌమ బిరుదాంకితులు మన అభిమాన యముడు గారైన ' కైకాల సత్యనారాయణ ' గారికి ఇప్పటి దాక ఒక్క నంది అవర్డు ఇవ్వలేదంటే నమ్ముతారా? 777 సినిమాలలో విలక్షణమైన పాత్రలలో కనిపించారు మనకి. కొన్నాళ్ళ పాటు భారీ పౌరాణిక పాత్రలకి ఎంటీఆర్ గారి తరువాత ఆయనే దిక్కు. మంచి వాక్ధాటి, స్వచమైన భాష కలిగిన మహా నటుడు. చిర కీర్తి, ఒక శాశ్వత స్థానాన్ని సంపాదించుకున్నారు సినీ రంగంలో.

బహుశా మన తెలుగు నాట పుట్టి కళా రంగమే తమ జీవితం అనుకున్న వాళ్ళు ఎందరో ఉన్నారు. ఆ సినీ రంగ మాయ లో పడి అటు ఆర్ధికంగా సరిగ్గా స్థిరపడక, ఇటు తగిన గుర్తింపు లేక చితికి పోయి, కాలం వెళ్ళబుచ్చుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కొన్ని సంస్థలు ఇటువంటి అవసరాలను ఆదుకోవటానికి స్థాపించబడ్డాయి. కాని ఇంకా వేగంగా అభివృద్ధి లోకి రావాలి. ఇప్పటికైన కళ్ళు తెరిచి, తెలుగు కళామ్మతల్లికి తమ జీవితాన్ని ధారపోసిన ఎందరో మహా కళాకారులకు తగిన గుర్తింపు ఇవ్వాలని సవినయ మనవి.మనిషి పోయాక గుర్తుచేసుకోవడం మంచిదే, కాని అదే ఆ మనిషిని బతికుండగా గుర్తిస్తే అతన్ని నిజంగా ఆదరించినవారమౌతాం.