Tuesday, June 30, 2009

ఆకాశ గంగ!

మూడు వారాల క్రితం, రేలా రే రేలా ఒక ఎపిసోడ్ లో ఒక గాయని పాడిన పాట కు పరవశించి న్యాయ నిర్ణేత అయిన గోరటి వెంకన్న గారు అందుకున్న ఒక అద్భుత దృశ్య కావ్యం..ఈ వాన పాట..



గల్త గూటీ లోని గడ్డీని తడిపింది..
గువ్వ గూటి గులక రాళ్ళను జరిపింది..
తీతువా గొంతును తీయగా చేసింది..

అడివి పిట్టల ముక్కు పాసీ ని కడిగింది!
సెట్ల బిరడా మీదా బొట్లు బొట్లు రాలి..
గట్ల బండలపైన గంధమై పారింది!!
అయ్యొ వానొచ్చెనమ్మా ...వరదొచ్చెనమ్మా.
వానతోపాటుగా వణుకొచ్చెనమ్మా !
పారాడి పారాడి గోదారిలో కలిసి...
సీతమ్మ పాదాల సిరసొంచి తకింది..
వంకలు టొంకలు వనములన్నీ తిరిగి..
కృష్ణమ్మవొడి చేరి ఇష్టంగ వొదిగింది!
దుందుభి తలకంట దుమ్మంత కడిగింది..
అందమైన ఇసుకను అద్దంల జేసింది!!
విశ్వరమణీయాల వింత జల చక్రం
పవనమై నింగిలో పారాడిన ఈ చక్రం
అవని సుట్టు అల్లుకొనెడి అందమైన చక్రం
అనంత కాంతి పింజరములు అలరించే నింగిని నేలకు వెదజల్లేడి వాడు
అతనేమొ మండే కొలిమి
సాగరముతోన చెలిమి
ఆ నింగి సాగరాల మధ్య బంధము జల చక్రము

పారే వాగు వంకలుగా పచ్చనాగు రెమ్మలు
ఆ అంతులేని సంద్రము ఆ సరసులెంతో అందము
కోనేటి కొలను కాల్వలు ఊరేటి ఊట సెలిమలు
సిందాడే నీటి మువ్వలు, సిన్న్నరి సినుకు గవ్వలు!!
సిరుగాలి పాటకెగసి ఎగసి సినుకుల దరువేస్తవీ
కొత్త నీటితొ వచ్చి కోనేట్లొ జేరింది
సేపకేమొ నీటి పొలుపులు దాపింది
కొంగకేమో విందు కోరిక రేపింది
కప్పల పండుగ కళ్ళార చూసింది
తాబేలు పెళ్ళికి తల నీరు పోసింది
పొంగేటి కల్లులో పోసింది సన్నీళ్ళు
ఈత సెట్టు లొట్టి మూతిని కడిగింది..
పారాడి పారాడి గోదారిలో కలిసి..
దుందుభి తలకంట దుమ్మంత కడిగింది..
ఇష్టముందో లేదో పట్నానికొచ్చింది
ముక్కు మూసుకొని మూసీలొ ముణిగింది!!!



Monday, June 29, 2009

రెలా రే రేలా .. దుమ్ము లేపు!!



మా టీవీ వారి ఒక అద్భుత సృష్టి ఈ కార్యక్రమం. ఇదేమి పూర్తి స్థాయి నూతన ప్రయోగం కాదు. మునుపు దూరదర్శన్ లో సాయంత్రం వేళల్లో వచే జనపద పాటల కర్యక్రమం ని అనుసరించి ఉంది. కాని నేటి తరానికి ఏమత్రం తీసిపోకుండా, ఈ మీడియా కాంపిటీటివె ప్రపంచం లో కూడా ఒక శాస్వత కీర్తి ని సొంతం చేసుకుంది.


అట్టడుగున దాగి ఉన్న ఆణిముత్యాలను వెలికి తీసి మనకు అందిస్తున్నారు ఈ అపర జానపద కళాకారులు. కొన్ని పాటల సాహిత్యం వింటుంటే, కంటుంటే, కలిగే అనుభూతి అనిర్వచనీయం.
జాతీత్య స్థాయిలో అవర్డులను సొంతం చేసుకొని, నిజంగా తెలుగు నేల మీద దుమ్ము లేపుతోంది. ఇటువంటి మంచి కార్యక్రమం అందిస్తున్న మా టీవీ వారిని మెచ్చుకొని తీరాలి.

సినిమా సాహిత్యం కి భిన్నంగా మట్టిలోంచి పుట్టిన మాణిక్యాలను సాహితీ ప్రియులకు అందచేసే ఈ కార్యక్రమాం ప్రశంసనీయం. తద్వారా సరైన గుర్తింపు లేక శిధిలమైపొతున్న అద్భుత సాహిత్యాన్ని తిరిగి జీవింపచేస్తున్న ఈ ప్రయతనం చాలా గొప్పది.


రెండు దరువులు విజయవంతంగా పూర్తి చేసుకుని, మూడవ దరువులోకి అడుగుపెట్టిన ఈ కార్యక్రమం అనతి కాలంలోనే అందరి అభిమానాన్ని చూరగొన్నది అనటంలో ఆస్చ్రయం లేదు.దీనికి ప్రత్యక్ష సాక్షులు రెండవ దరువు ఫయినల్స్ కి వేంచేసిన కళాభిమానులైనటువంటి వేల మంది ప్రేక్షకులే!!
రాష్ట్ర నలుమూలల జల్లెడ బట్టి ఆయా ప్రాంతీయ భషలలొ, యాసలలొ అద్భుత జానపదాలను వెలికితీస్తున్నారు.
అమ్మమ్మలు, తతమ్మల తరాలలతో ఆ పాటలు కూడా అంతరించిపోకుండా, ముందు ముందు తరాలు అవి నేర్చుకుంటారని, కాల చక్రంతో పాటే ఆ సాహిత్య సంపద తిరుగుతూ ఉంటుందనీ ఆశిద్దాం.
సాహిత్య పరంగా కొన్ని పద ప్రయోగాలు నిజంగా అద్భుతాలే.
రేలా రే రేలా కి జయ హో!

Image courtesy: http://idlebrain.com/