Sunday, October 14, 2007

ఓం బ్లాగాయనమ:

పుస్తకానికి ముందుమాట లాగా, ఇది నా బ్లాగు మొదలుపెట్టినప్పుడే వ్రాయవలసిన ముందు బ్లాగు.

better late than never అన్నట్టు, ఇప్పుడైనా వ్రాయటం సబబే అనిపించింది.
అసలు ఈ బ్లాగు పద్ధతి ఎవరు కనిబెట్టారో కాని, వాళ్ళకి అక్షర సన్మానం ఐనా తగు రీతిలో చేయలని ఉంది. గ్రాహం బెల్ ఫొన్ కనిపెట్టినప్పుడు, ఎడిసన్ బల్బ్ కనిపెట్టినప్పుడు కలుగు ఆనందం ఈ సందర్భం లో కలిగింది నాకు. కారణం..

ఈ బ్లాగు వలన మనకెన్నో సౌకర్యాలు. అవేంటో కింద మనవి చేసుకుంటున్నాను:

సౌకర్యం నెం. 1: ఏ విషయమై, మన గోడు జనాలకి వినిపించాలన్నా, మన ఆలోచనా తరంగిణులు ఎవరితోనైనా పంచుకోవాలన్నా, ఒక సమస్యను నలుగురి దృష్టికి తీసుకువెళ్ళాలన్నా, ఒక విషయమై పదుగురి విమర్శ పొందాలన్నా,పత్రికే దిక్కు! editor గారే దేవుడు. తీరా మన శీర్షిక పంపించిన రోజు, editor గారి భార్యామణి పొద్దునే ఆయనకి ఉప్పులేని chutney పెట్టిందనుకోండి, మన పని గోవింద. ఎలుకలు తినగా మిగిలిన కాగితాల జాబితాలోకి మన సరుకు వెళ్ళి చేరుతుంది! ఈ విషయం తెలియక మనం, wanted column నించి, శ్రద్ధాంజలి column వరకు ఎక్కడ పడితే అక్కడ , మన వ్రాత కోసం కళ్ళు చింతపిక్కలంత చేసుకొని , వానకోసం చూసే రైతు లా ఎదురు చూపులు తప్పేవి కావు. ఇంత ఉపోద్ఘాతమెందుకు అంటే, ఇదంతా తప్పింది కదా? వెంటనే పాఠక మహాశయుల విలువైన అభిప్రాయాలు దొరికే వీలు ఉన్నది. ఒక సమస్య విషయం లో అప్పుడప్పుదు చర్చలు కూడా జరుగుతాయి. ఇదే కదా నా బోటి వాళ్ళు కోరుకునేది!!

సౌకర్యం నెం. 2:నేనేమి తెలుగు పండితురాలిని కాదు. కనుక అప్పుడప్పుడు తప్పులు తడికలు దొర్లవచ్చును. నా బ్లాగు ఎందరో చదవవచ్చు. భాషా పాండిత్యం ఉన్న పాఠకులు చదివినప్పుడు బుడుగు style లో 'కొరడాతో నడ్డి మీద ఛంపేయవచ్చును'! లేక నా వారఫలాలు బాగోలేక మా తెలుగు మేష్టారు చదివారనుకోండి, తప్పక బెత్తం తిరగేస్తారు, ఇన్నేళ్ళైన నాకు భాష రాలేదని బడిత పూజ తప్పదు. కావున ఒళ్ళు దగ్గర పెట్టూకొని వ్రాయాలి. so ఇది ఒక రకంగా నా భాష ని నేను మెరుగు పరుచుకున్నట్లే కదా?

సౌకర్యం నెం 3: internet వచ్చిన కొత్తల్లో, మనకంటూ ఒక webpage కావాలంటే, 'geocities' ఏ దిక్కు! దాన్నిండా బోలెడన్ని limitations, అది కాకపోతే, వేరేగా ఐతే రుసుము చెల్లించి మరీ web space కొనుక్కోవలెను, కొనుక్కున్నా దానికి వయొపరిమితి కలదు. మరి ఈ బ్లాగు వచ్చిన తరువాత, మనకంటూ ఒక space ఏర్పడినది కదా? హాయిగా ఏ ఆడ్డంకీ లేకుండా మనది అని చెప్పుకునే webpage సొంతమయ్యింది!

ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో.. కనుక నమో బ్లాగాయనమ: