Thursday, July 3, 2008

గుర్తింపు కావాలి





ఊరకరారు మహానుభావులు అని .. ఒక కారణానికై పుట్టి, అది నెరవేర్చి, తిరిగి వచ్చిన చోటికే వెళ్తూ, అశేష ప్రజల ఆదరాభిమానాలని త్రుప్తిగా పొంది ,చిరస్మరణీయులుగా చరిత్రలో చెరగని ముద్ర వేసుకొని, తమకంటూ ఒక చిన్న column ఏర్పరచుకొని వినీలాకాశం లో తారలై నిల్చిపోయారు మన అభిమాన నటులెందరో!

గత రెండేళ్ళలో గొప్ప నటీనటులు అనతి కాలం లోనే తెలియకుండానే కనుమరుగయ్యారు. మనలో చాలా మందిని దుఖసాగరంలో ముంచివేశారు. ఒక లక్ష్మీకాంత రావు, ఒక శొభన బాబు, ఒక మల్లికార్జున రావు, ఒక కల్పనా రాయి, ఐరన్ లెగ్ శాస్త్రీ, సాక్షిరంగారావు, ఇలా ఎందరో.. వారు వచ్చిన పనిని ముగించి మనందరి అభిమానాన్ని సంపాదించుకొని తారలై వెలుగుతున్నారు, వెలుగుతూనే ఉంటారు !!

జీవితం బుద్బుదప్రాయం..నీటి బుడగ వంటి వేదాంత ధొరణి తెగ వింటూ ఉంటాం రోజు..హటాత్తుగా పోయినప్పుడు అయ్యో, పోయారు అనుకోవటం, ఎవరికి చేతనైనంత పరిధిలో వారు నివాళులు అర్పించటం మామూలే.

పోయిన మనిషి కనుక ఇదంతా చూస్తుంటే ' ఆ నలుగురు' సినిమాలోలాగా..బతికుండగా నాకు, నా కళ కు, తగిన గుర్తింపు ఇవ్వని ప్రజ, ప్రభుత్వం, కనీసం ఇప్పుడైనా నన్ను చూడటానికి, నాలుగు కన్నీటి బొట్లు రాల్చటానికి, వచ్చారు అని త్రుప్తి పడతాడేమో?

హాస్యానికన్నా అది పచ్చి నిజం. వీరిలో ఎంతో మందికి సరైన గుర్తింపు లేదు. సరైన పారితోషికం లేదు. అవార్డులు, రివార్డులు లేవు. ఇకపై వస్తాయో లేదో తెలియదు. తెలుగు మాట్లాడటం కూడా రాని నూతన నటీనటులకు ఎక్కడలేని పబ్లిసిటీ, అక్కర్లేని మర్యాదలు, గోరోజనాలు! ఉదాహరణకి నవరస నటనా సార్వభౌమ బిరుదాంకితులు మన అభిమాన యముడు గారైన ' కైకాల సత్యనారాయణ ' గారికి ఇప్పటి దాక ఒక్క నంది అవర్డు ఇవ్వలేదంటే నమ్ముతారా? 777 సినిమాలలో విలక్షణమైన పాత్రలలో కనిపించారు మనకి. కొన్నాళ్ళ పాటు భారీ పౌరాణిక పాత్రలకి ఎంటీఆర్ గారి తరువాత ఆయనే దిక్కు. మంచి వాక్ధాటి, స్వచమైన భాష కలిగిన మహా నటుడు. చిర కీర్తి, ఒక శాశ్వత స్థానాన్ని సంపాదించుకున్నారు సినీ రంగంలో.

బహుశా మన తెలుగు నాట పుట్టి కళా రంగమే తమ జీవితం అనుకున్న వాళ్ళు ఎందరో ఉన్నారు. ఆ సినీ రంగ మాయ లో పడి అటు ఆర్ధికంగా సరిగ్గా స్థిరపడక, ఇటు తగిన గుర్తింపు లేక చితికి పోయి, కాలం వెళ్ళబుచ్చుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కొన్ని సంస్థలు ఇటువంటి అవసరాలను ఆదుకోవటానికి స్థాపించబడ్డాయి. కాని ఇంకా వేగంగా అభివృద్ధి లోకి రావాలి. ఇప్పటికైన కళ్ళు తెరిచి, తెలుగు కళామ్మతల్లికి తమ జీవితాన్ని ధారపోసిన ఎందరో మహా కళాకారులకు తగిన గుర్తింపు ఇవ్వాలని సవినయ మనవి.మనిషి పోయాక గుర్తుచేసుకోవడం మంచిదే, కాని అదే ఆ మనిషిని బతికుండగా గుర్తిస్తే అతన్ని నిజంగా ఆదరించినవారమౌతాం.

7 comments:

Anil Dasari said...

అవార్డులు రాకున్నా వాళ్ల గొప్పతనమేమీ తగ్గదుకదా. ఎన్టీయార్ కి కూడా ఒక్క నంది అవార్డూ రాలేదు మరి! పైగా, ఏడాదికో అవార్డు మాత్రమే ఇచ్చే అవకాశమున్నప్పుడు వందల కొద్దీ మహామహులున్న పరిశ్రమలో ఎవరో ఒకరికి అన్యాయం జరిగితీరుతుంది. అది తప్పదు.

వసంతకోకిల said...

నంది గురించి నేను సూచించినది కేవలం ఒక ఉదాహరణ మాత్రమే. వేరే ఎన్ని రకాల అవార్డులు లేవు? ఏ ఒక్కటి ఇచ్చి సత్కరించట్లేదు. ఐనా 777 సినిమాలు చేసినా character artist గా నైనా ఒక్క నంది కి నోచుకోకపోవడం నిజంగా చింతించవలసిన విషయం.
అది కాక, పలుకుబడి, రాజకీయ అండ ఉన్న ఎందరికో వచీన అవార్డులే మళ్ళీ వచ్చి, పొగడ్తల చిట్టాలు ఆపకుండా ఇస్తున్నారు. తెలుగు సినిమా కి కొత్తదనం తీసుకొచ్చిన కృష్ణ గారికే మొన్నటి వరకు దిక్కు లేదు!

ఒక్క మాట నిజం.. కళాకారుడికి చప్పట్లే భోజనం, గుర్తింపే జీవితం.. అది మరవకూడదు.

వసంతకోకిల said...

ఏడాదికొక్క అవార్డు ఇచ్చినా, 777 సినిమాలు ఒక్క ఏడాదిలో చేయలేదు..కొన్ని దశాబ్దాలు పట్టాయి.. అన్ని ఏళ్ళలో ఒక్క అవార్డు కూడా ఇవ్వాలనిపించలేదంటారా? నోరు తెరిచి వారు అడగకపోయినా, అభిమనులు చొరవ చేసి ఇటువంటి విన్నపాలు చేసినప్పుదు, వారి మాట తోసిపుచ్చలేక కొంత కొంతమందికైనా కొన్ని సందర్భాలలో పురస్కారాలను ప్రకటించినప్పుదు, వారిపై గౌరవం తో కాక, ఎవరో చెప్పారని ఇస్తున్న ఆ బలవంతపు కీర్తి కిరీటాన్ని మోయలేక ఆత్మాభిమానం తో తిరస్కరించిన వారూ ఉన్నారు. అందుకే, ఆ పరిస్థితి రాకుండా , ముందే గ్రహించి, వారి వారి స్థాయికి తగ్గట్టు గుర్తింపు ఇవ్వాలని నా విజ్ఞప్తి.

వసంతకోకిల said...

క్షమించాలి.. మీరు నా point ని సరిగ్గా catch చేయలేదు. నేను ఇంకొంచెం clear గా రాయాల్సిందేమొ కూడా.

ఎంటీఆర్ గారికి నంది అవార్డు రాలెదన్నది వాస్తవమే. కాదని అనటం లేదు. ఆయన లోని ప్రతిభకి, తెలుగు సినీ రంగానికి ఆయన చేసిన సేవ కి తగిన గుర్తింపు లేదు. అది ఒప్పుకుంటాను. కాని నెను చెప్పదల్చుకున్న సంగతి కొంచెం వేరు. ఆయనకి గుర్తింపు లేకపోయిన, పలుకుబడి, రాజకీయ బలం, ఎదుగుదల సంభవించాయి. చాలా మటుకు అది ఆయన స్వయంకృషి.. కొంత ప్రజా బలం. కాని నేను focus చేస్తున్నది, talent ఉండీ, ఎటువంటి ఎదుగుదల లేక , మింగలేక కక్కలేక ఇబ్బంది పడుతున్న కొందరి కళాకారుల గురించి. వారిని గుర్తించటం కనీస బాధ్యత. ఒక సినిమా విజయవంతం అయ్యిందంటే దనికి అందరి తోడ్బాటు అవసరం. ఆఇదు వేళ్ళూ లేనిదే ముద్ద నోట్లోకి వెళ్ళలేదు, భోజనం చేసినట్టుండదు. అలాగే సినిమా. ఒక్క హీరో, ఒక్క హీరోయిన్ వలన అది విజయవంతం అవ్వదు. అందరి వలన అవుతుంది. మొన్నా మధ్య రామోకి రావు గారి ఫిలంసిటీ లో చూపిన ఒక షో లో తెర వెనుక ఉండి కధ నడిపించే ఘనుల గురించి చక్కగా పరిచయం జరిగింది. అది ఇంకో complete topic/blog. hope I conveyed it more clearly

thanks for stopping by..

కొత్త పాళీ said...

అవును, మీరు చెప్పింది నిజమే. సినిమా యెవార్డులు డబ్బు, పలుకుబడి రాజకీయమని ఎప్పుడోనే తేలిపోయింది. సత్యనారాయణ గారిని తగు విధంగా సత్కరించాలి అంటే ఏ పౌర సంఘాలో పూనుకోవాలి.

సుజాత వేల్పూరి said...

వసంత కోకిల గారు,
బాగా రాశారు! రక్తకన్నీరులో నాగభూషణం చెప్పినట్టు కళాకారుడికి చప్పట్లే భోజనం అయితే మీరు చెప్పిన కళాకారులందరికీ వాటికి లొటు లేదు. మీరా జాస్మిన్ కో, ప్రియమణి కో జాతీయ అవార్డులు వచ్చి ఉండొచ్చు! కానీ సత్యనారాయణ గారు బాగా నటిస్తారా, మీరా జాస్మినా అంటే ఏ జవాబుకెక్కువ అవకాశం ఉంటుందో ఆలోచించండి!

అవార్డుల సంగతి అలా ఉంచి, ఆర్థికం గా చితికి పోయిన నటుల గురించి పరిశ్రమ పట్టించుకోకపోవడం అన్యాయం! శోభన్ బాబు గారు సినిమాల నుంచి రిటైర్ అవడానికి కూడా కారణం చెప్పారు. ఆయన పోలీసు ఆఫీసర్ గా నటించిన ఒక సినిమాలో కేవలం సాక్షిగా అనుకుంటా ఒక చిన్న పాత్ర కాంతారావు గారికి ఇచ్చారట. షాట్ కోసం ఆయన్ వృద్ధుడై కూడా గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చేదట. కానీ వేరే ఆప్షన్ లేదు మరి. దానితో చలించిన శోభన్ బాబు గారు ఈ పరిస్థితి తనకు రాకూడదని తర్వాత రిటైర్ అయ్యారట.

నిజానికి కారెక్టర్ ఆర్టిస్టులే సినిమాకు చాలా సందర్భాల్లో ప్రాణం! గొప్ప టాలెంట్ ఉండీ, అదృష్టం లేక,వేషం ఇమ్మని అభిమానం చంపుకుని అడగలేని వాళ్ళు కోకొల్లలు!

పక్కింటబ్బాయి(మా పక్కింటోళ్లకి) said...

లాబీయింగ్ అనే ప్రక్రియ పై అవగాహన మన భారతదేశానికి అందులో మరీ ముఖ్యంగా తెలుగు వారికి తక్కువ అందువల్ల తలెత్తిన ఇబ్బంది ఇది.నాకు అవార్డు కావాలి,నేను అర్హుణ్ణి అని నేను అర్జీ పెట్టుకోవడం ఏంటి అని ఇంక లాబీయింగ్ కి చోటేదె.అది నిరాడంబరత అని మీరు పేరు పెడితే నిర్లక్ష్యం అని అవార్డు జ్యూరీ అంటుంది.
దీనికి కారణం మన గొప్పని మనం గుర్తించకూడదని పిల్లలకి నూరిపోయడమే.పైగా పక్క వాణ్ణే కాదు మనవాణ్ణి పొగడడం కూడా తక్కువ.దాంతో మన మీద మనకి అండరెస్టిమేషన్.మన గొప్పదనం మనం గుర్తించనప్పుడు ప్రపంచం గుర్తించాలనుకోవడం అత్యాశ.
---సంతోష్ సూరంపూడి