పారాడి పారాడి గోదారిలో కలిసి...
అతనేమొ మండే కొలిమి
పారే వాగు వంకలుగా పచ్చనాగు రెమ్మలు
కోనేటి కొలను కాల్వలు ఊరేటి ఊట సెలిమలు
కప్పల పండుగ కళ్ళార చూసింది
దుందుభి తలకంట దుమ్మంత కడిగింది..
my void on the net!
కొన్ని కొన్ని సంఘటనలు, వ్యక్తులు, మాటలు, చివరికి రాతలు కూడా ఒక్కోసారి గుర్తొచ్చి మనల్ని నవ్విస్తుంటాయి..
ఆ బపతులో నాకు చాలా మటుకు గుర్తుండిపోయినవి కొన్ని అచ్చుతప్పులు , మరి కొన్ని హాస్యాస్పదమైన రాతలు.
ఒక సారి మా దగ్గర బంధువులందరితో బాసర యాత్ర సంకల్పించి , ఒక రెండు కారుల్లో అందరం బయల్దేరాం.
సాధారణంగా ఇలాంటి రహదారి ప్రయాణాలకి పొద్దున్నే సూర్యోదయం ముందే బయల్దేరితే వెళ్ళే దూరాన్ని బట్టి భోజనాల వేళకి గమ్యం చేరుకోవచ్చు. లేదా హీన పక్షం సగం దూరమైనా చేరవచ్చు.
మేము కూడా అలాగే బయల్దేరాం।మార్గమధ్యంలో మా మావయ్యగారబ్బాయి ప్రకృతి పిలుపంటూ గొడవ చేయటం వలన కారు బలవంతం గా ఆపవలసి వచ్చింది।
ఎలాగూ ఆపాం కదా అని కాస్త ఫలహారం తో ఆత్మారాముని శాంతింపచేసే సదుద్దేశం తో ఆ పనికి పూనుకున్నాము।దగ్గర్లో ఒక చిన్న టిఫిన్ సెంటరు కనిపించేసరికి ప్రాణము లేచొచ్చినట్టయింది.
ఆ రోజు స్పెషల్ ఐటంస్ లిస్ట్ ఉన్న బోర్డు ఒకటి బయట ప్రయాణికులకి కనిపించేలా పెట్టారు
కాసేపు దాని ఎగా దిగా కింద నించి పైకి తేరి పార సుమారు అందరం చదవటానికి ప్రయత్నించాము। తరువాత ఒకళ్ళ మొహాలు ఒకళ్ళము చూసుకున్నాము। పేపరులో వచ్చే చావు కబురు కాలము హెడ్లైను లో అన్నట్టు 'అనుమానాస్పద స్థితిలో యువతి' మొహాలు పెట్టాం ఒక్క నిముషం అందరం ।
మరుక్షణం అందరం పొట్ట చెక్కలయ్యేలా నవ్వటం మొదలుపెట్టాం. దాదాపు ఒక పావు గంట ఆగకుండా నవ్వి ఉంటాం. అంతలో మా తాతయ్య ఒక అంగ ముందుకేసి హోటల్ వాడిని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టనారంభించారు.
ఆయన అసలే ముక్కోపి. దూర్వాసుడికి దగ్గర బంధువు.. అందులోను తెలుగు భాషాభిమాని।వాడి మొహం చూసి జాలేసింది మాకు। ఎరక్కపోయి ఆపాం రా బాబు అనుకున్నాం పాపం. ఇంతకి సస్పెన్సు ఎందుకు కాని, ఏ ఫలహారాల పట్టిక సారాంశం ఇది....
1 ఉక్ము దొష
2 మసల దొష
3 రవ ఉక్ము
4 చెట్టీ
ఇవన్నీ కాక ఏకంగా ఇంగ్లీషులో ' సోతా మిలాస్ రేవో' అని రాసుంది। పైన నాలుగు కాస్త కష్టపడితే అర్ధమయ్యాయి కాని, ఆ ఆంగ్ల కవి హృదయం చాలా సేపటికి కాని అంతు పట్టలేదు!
ఇక మేము కనిపెట్టలేము అని మాలోని షర్లోక్ హోంస్లు ,బ్యోంకేష్ బక్షీలు సైతం చేతులెత్తేశాక..ఆ హోటల్ వాడినే తెగించి అడిగేశాం..
సమాధానం విని..మా అత్తయ్య కి ఇంచు మించు మూర్చ వచ్చినట్టయ్యింది . కాసేపు ఏ రియాక్షను లేకుండా ఆకలి సంగతి కూడా మర్చిపోయి అలాగే ఉండిపోయాం.
వాడు రాయలనుకున్నది ॥ 'సౌత్ మీల్స్ రెడీ' !!!!
రాష్ట్ర సరిహద్దులో హోటలు పెట్టి, తెలుగు వారికి తెలుగులోనే వడ్డించాలనుకున్న ఆ హోటలు వాది అపూర్వ ప్రయత్నం హర్షించి, వాడికి సరి చేసిన మాటలు ఒక కాగితం మీద రాసిచ్చి, మల్లి బోర్డు కొత్తది చేయించు నాయన అని నచ్చ చెప్పి , అందరం తలా ఒక ఉక్ము దొష .. అదేనండి ఉప్మ దోశ తిని ప్రయణం కొనసాగించాం..
లారీల వెనుక, ఆటోల వెనక కూడా కొన్ని కొన్ని సార్లు ఇలాంటి భాష మనకు తారస పడుతూ ఉంటుంది..
'తల్లి దీవేనా' , ' యహోవా నా కప్రి ' ...
జంధ్యాల గారి హై హై నాయక లో నరేష్ పాత్ర ఇటువంటి వి సరి చేసే తెలుగు పంతులు పాత్ర॥చాదస్తం గా నడి రోడ్డు మీద ఆపి చెప్పినా , పక్కకి పిలిచి చెప్పినా , మన ముఖ్య ఉద్దేశ్యం తప్పుని సరిచేయటమే.. అందుకు జంకెందుకు? మన భాషను మనము ముందు గౌరవిస్తే తదుపరి ఎదుటి వారు గౌరవిస్తారు।కనుక అదే మన తక్షణ కర్తవ్యం!!