కొన్ని కొన్ని సంఘటనలు, వ్యక్తులు, మాటలు, చివరికి రాతలు కూడా ఒక్కోసారి గుర్తొచ్చి మనల్ని నవ్విస్తుంటాయి..
ఆ బపతులో నాకు చాలా మటుకు గుర్తుండిపోయినవి కొన్ని అచ్చుతప్పులు , మరి కొన్ని హాస్యాస్పదమైన రాతలు.
ఒక సారి మా దగ్గర బంధువులందరితో బాసర యాత్ర సంకల్పించి , ఒక రెండు కారుల్లో అందరం బయల్దేరాం.
సాధారణంగా ఇలాంటి రహదారి ప్రయాణాలకి పొద్దున్నే సూర్యోదయం ముందే బయల్దేరితే వెళ్ళే దూరాన్ని బట్టి భోజనాల వేళకి గమ్యం చేరుకోవచ్చు. లేదా హీన పక్షం సగం దూరమైనా చేరవచ్చు.
మేము కూడా అలాగే బయల్దేరాం।మార్గమధ్యంలో మా మావయ్యగారబ్బాయి ప్రకృతి పిలుపంటూ గొడవ చేయటం వలన కారు బలవంతం గా ఆపవలసి వచ్చింది।
ఎలాగూ ఆపాం కదా అని కాస్త ఫలహారం తో ఆత్మారాముని శాంతింపచేసే సదుద్దేశం తో ఆ పనికి పూనుకున్నాము।దగ్గర్లో ఒక చిన్న టిఫిన్ సెంటరు కనిపించేసరికి ప్రాణము లేచొచ్చినట్టయింది.
ఆ రోజు స్పెషల్ ఐటంస్ లిస్ట్ ఉన్న బోర్డు ఒకటి బయట ప్రయాణికులకి కనిపించేలా పెట్టారు
కాసేపు దాని ఎగా దిగా కింద నించి పైకి తేరి పార సుమారు అందరం చదవటానికి ప్రయత్నించాము। తరువాత ఒకళ్ళ మొహాలు ఒకళ్ళము చూసుకున్నాము। పేపరులో వచ్చే చావు కబురు కాలము హెడ్లైను లో అన్నట్టు 'అనుమానాస్పద స్థితిలో యువతి' మొహాలు పెట్టాం ఒక్క నిముషం అందరం ।
మరుక్షణం అందరం పొట్ట చెక్కలయ్యేలా నవ్వటం మొదలుపెట్టాం. దాదాపు ఒక పావు గంట ఆగకుండా నవ్వి ఉంటాం. అంతలో మా తాతయ్య ఒక అంగ ముందుకేసి హోటల్ వాడిని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టనారంభించారు.
ఆయన అసలే ముక్కోపి. దూర్వాసుడికి దగ్గర బంధువు.. అందులోను తెలుగు భాషాభిమాని।వాడి మొహం చూసి జాలేసింది మాకు। ఎరక్కపోయి ఆపాం రా బాబు అనుకున్నాం పాపం. ఇంతకి సస్పెన్సు ఎందుకు కాని, ఏ ఫలహారాల పట్టిక సారాంశం ఇది....
1 ఉక్ము దొష
2 మసల దొష
3 రవ ఉక్ము
4 చెట్టీ
ఇవన్నీ కాక ఏకంగా ఇంగ్లీషులో ' సోతా మిలాస్ రేవో' అని రాసుంది। పైన నాలుగు కాస్త కష్టపడితే అర్ధమయ్యాయి కాని, ఆ ఆంగ్ల కవి హృదయం చాలా సేపటికి కాని అంతు పట్టలేదు!
ఇక మేము కనిపెట్టలేము అని మాలోని షర్లోక్ హోంస్లు ,బ్యోంకేష్ బక్షీలు సైతం చేతులెత్తేశాక..ఆ హోటల్ వాడినే తెగించి అడిగేశాం..
సమాధానం విని..మా అత్తయ్య కి ఇంచు మించు మూర్చ వచ్చినట్టయ్యింది . కాసేపు ఏ రియాక్షను లేకుండా ఆకలి సంగతి కూడా మర్చిపోయి అలాగే ఉండిపోయాం.
వాడు రాయలనుకున్నది ॥ 'సౌత్ మీల్స్ రెడీ' !!!!
రాష్ట్ర సరిహద్దులో హోటలు పెట్టి, తెలుగు వారికి తెలుగులోనే వడ్డించాలనుకున్న ఆ హోటలు వాది అపూర్వ ప్రయత్నం హర్షించి, వాడికి సరి చేసిన మాటలు ఒక కాగితం మీద రాసిచ్చి, మల్లి బోర్డు కొత్తది చేయించు నాయన అని నచ్చ చెప్పి , అందరం తలా ఒక ఉక్ము దొష .. అదేనండి ఉప్మ దోశ తిని ప్రయణం కొనసాగించాం..
లారీల వెనుక, ఆటోల వెనక కూడా కొన్ని కొన్ని సార్లు ఇలాంటి భాష మనకు తారస పడుతూ ఉంటుంది..
'తల్లి దీవేనా' , ' యహోవా నా కప్రి ' ...
జంధ్యాల గారి హై హై నాయక లో నరేష్ పాత్ర ఇటువంటి వి సరి చేసే తెలుగు పంతులు పాత్ర॥చాదస్తం గా నడి రోడ్డు మీద ఆపి చెప్పినా , పక్కకి పిలిచి చెప్పినా , మన ముఖ్య ఉద్దేశ్యం తప్పుని సరిచేయటమే.. అందుకు జంకెందుకు? మన భాషను మనము ముందు గౌరవిస్తే తదుపరి ఎదుటి వారు గౌరవిస్తారు।కనుక అదే మన తక్షణ కర్తవ్యం!!
19 comments:
"రాష్ట్ర సరిహద్దులో హోటలు పెట్టి, తెలుగు వారికి తెలుగులోనే వడ్డించాలనుకున్న ఆ హోటలు వాది అపూర్వ ప్రయత్నం హర్షించి, వాడికి సరి చేసిన మాటలు ఒక కాగితం మీద రాసిచ్చి, మల్లి బోర్డు కొత్తది చేయించు నాయన అని నచ్చ చెప్పి,....."
మీ ప్రయత్నానికి నా జోహార్లు.
ఇదివరకెక్కడో చదివిన జ్ఞాపకం. హైదరబాద్ లో పెట్టిన ఒక బోర్దు - ఇచ్చట మెడ మీద టైపు చేయ బడును.
మా వూర్లో ఒక స్వీట్ షాప్ బోర్డు ఇలా ఉంటుంది.
"శ్రీ సితారా మాస్వీటుస్టాలు" :)
రాష్ట్ర రాజధాని హైదరాబాదు లోని అలియాబాద్ పోస్ట్ ఆఫీస్ ముందరి ప్రకటన బల్లపై ఇట్లా రాసి ఉంది ' తంతే తపాలా ఆఫీసు '. ఇది 25 ఏళ్ల క్రితం సంగతి.
ఇది మాత్రం నాకు చాల నచ్చేసింది. అచ్చ తెలుగు - విజయవాడలో కృష్ణలంకలో ఓ కిళ్ళీ బడ్డీ మీద పేరు - శ్రీ రాఘవేంద్ర తాంబూల దుకాణం
@ c b rao: "తంతే తపాలా ఆఫీసు" తంతే, తపేళా కార్యాలయం" కూడా ఉండేది.
అంతా బాగానే ఉంది గానీ మరి మీరు చేసిందేందో అచ్చు తప్పులు బదులు అప్పుతచ్చులన్నారే నిజంగా ఇది తెలిసి చేసిందా లేక....
:) :) :)
"నిధానమే ప్రదానాలు", "13 మూకాలా" లు చాలా చూసానుగానీ "సోతా మిలాస్ రేవో" మాత్రం బ్రహ్మాస్త్రం.
ఇలాంటిదే పాశుపతాస్త్రం ఒకటి., రాతల్లో కాదు, మాటల్లో..
నేను గతంలో పనిచేసిన సంస్థలోని సంగతి.... పక్క విభాగంలోని ఇంజనీరు తన ఉద్యోగి ఒకతన్ని నా దగ్గరకు పంపించాడు.. ఏదో వస్తువు తెమ్మని. అతనొచ్చి మా సారు "ఎబ్బినియరు కార్ఫైర్" తెమ్మంటున్నాడు అని అడిగాడు. అర్థంగాక, మళ్ళీ అడిగా ఏంటని. "ఎబ్బినియరు కార్ఫైర్" అన్నాడు మళ్ళీ. ఎన్నివిధాల ప్రయత్నం చేసినా అదేంటో పట్టుకోలేకపోను. మధ్యాహ్నం సమయం.. అందరూ ఎవరి పనుల్లో వాళ్ళున్నారు నన్నాదుకునేందుకు ఎవరూ లేకపోయారు. కాగితం మీద రాయించుకురా అని పంపించేసాను.
పక్క విభాగపు గురుడికి కావలసింది "వెర్నియర్ కాలిపర్స్" అని కాగితం చూసాకే తెలుసుకున్నాను.
నవ్వుకోడానికి చాలా బాగుందండి. కానీ తెలుగు పుస్తకాలని డిజిటలైజు చేసే ఘన ధ్యేయంతో ఇప్పటికి 50,108 పుస్తకాలు గల సైటులో గుణకారాలు చూడండి.
కనుపర్తి వరల్మమ్మ by పోలాప్రగడ రాజ్యల్మి
గ్రైఇకుపురాన కధలు ఒ... by సేట్టి ల్మినరసింహము
వీటికి ఇంగ్లీషు పదాలు కూడా ఈతెలుగుకి సరిసమానంగా రాసారు.
/www.ulib.org/index.html
@ చిలమకూరు విజయమోహన్ : తెలిసి రాసిందే .. ముళ్ళపూడి వెంకటరమణ గారి బాపూ రమణీయం జోకుల సంపుటి లో ఆయన ఇలా ప్రస్తావించారు. నచ్చి నేను అలా రాశాను
క్షమించండి.
సరదాగా వుంది.
మిర్యాల గూడా దగ్గరున్న నార్కెట్ పల్లి ఆర్టీసీ బస్టాండ్ బయట ఒక హొటల్ ముందు "దోష పూరిత ఇడ్లీ లభించును" అని ఉంది. మూర్ఛ పోయాను. డైరెక్టుగా దోష పూరిత ఇడ్లీ లభిస్తుందని రాశాడేమిటా అని. ఆ హొటల్లో తినకపోయినా వాడి కవి హృదయమేమిటో తెలుసుకోవాలని వెళ్ళి అడిగితే తెలిసింది. దోశ, పూరి & ఇడ్లీ లభించును అట! &(and) అని అతడు యధా ప్రకారం రాయబోయి..త ఆకారంలో చిత్రించాడు.
అలాగే నేను అయిదో క్లాసు చదివేటపుడు ముఖ్యమంత్రై పేరు రాయమంటే ఒక మొద్దు పిల్ల ఇలా రాసింది."నద్రంకు తరకు రమరవ" అని! అంటే ఏమీ లేదు నందమూరి తారక రామారావని అర్థం ట.
బెంగళూరులో కార్లు, లారీల వెనక అద్దం మీద "కందికాయ ఆశీర్వాద" అని చదివి విస్తుపోతుండేదాన్ని, కందికాయ ఆశీర్వదించడమేమిటని. తర్వాత నెమ్మదిగా అర్థమయింది అది "తందె తాయి ఆశీర్వాద " అని. (తల్లిదండ్రుల ఆశీర్వాదం) కన్నడ "త" తెలుగు "క" లాగా ఉంటుంది.
మల్లిక్ గారు,
మీరు పేర్కొన్న ముద్రా రాక్షసం బాగుంది. "మెడ మీద టైపు చేయబడును"
పొట్ట చెక్కలయింది.
వసంత కోకిలా,
మీ అప్పుతచ్చులు బహు పసందుగా ఉన్నాయి.
@ సుజాత: మీరు ఒక్క స్టెప్పు ముందుకేసి కన్నడ కూడా రుచి చూపించారు.. ధన్యవాదములు..
నేను చిన్నప్పుడు బెంగళూరూ వెళ్ళినప్పుడు, అక్కడ రహదారుల వెంట 'బారో, రెస్టారెంటో' అని రాసి ఉండటం గమనించి, మెల్లగా మా అమ్మని అడిగాను, "ఇదేంటమ్మా అది బారో,రెస్టారెంటో కూడా వాళ్ళకే తెలియదా? అని!! మా అమ్మ పొట్ట చెక్కలయ్యేలా నవ్వింది..మరి తెలుగులో 'ర్' కన్నడ లో 'రో' లా కనిపిస్తుంది..అది నాకేమి తెలుసు?
హ హ వసంతకోకిల గారు సౌత్ మీల్స్ సూపర్, బారో రెస్టారెంటో చూసి నాకు కూడా మొదట వచ్చిన ఆలోచన అదే "తింగరెదవలు అదేంటో వాళ్ళకే తెలీదా !!" అని.
మల్లిక్ గారు చెప్పిన మెడ మీద టైపు, సుజాత గారు చెప్పిన అప్పుతచ్చులుకూడా బాగానవ్వించాయి.
ఆహా.. పొట్ట చెక్కలయ్యేలా నవ్వాను బాబోయ్.. :)
ఈ పోస్ట్ నేను ఇప్పటి దాకా ఎలా మిస్సయ్యాను చెప్మా.. :(
మొత్తానికి అందరూ అప్పుతచ్చులని భలేగా చెప్పారు :)))))
ఆంధ్ర సైడ్ భోజనం తయారు అని బోర్డు పెడితే , తెలంగాణా సైడ్ భోజనం తయ్యారు ఉన్నది అని రాస్తారు .చాల ఏళ్ళ క్రితం సికింద్రాబాద్ స్టేషన్ ఎదురు గా వున్నా పద్మజ లాడ్జి ముందు అదే బోర్డు జీర్నావస్టలో వుండి భోజనం చెరిగి పోయి'' ''తాయారు ఉన్నది '' అన్నా దే కని పిస్తూ ఉండేది.మొదటి సారి హైదరాబాద్ వచ్చిన మా రైతులు వార్దినమ్మ హైదరాబాద్ పెద్దపురాన్ని మించి పోయిందిరా బోర్డు లు పెట్టి మరీ లాడ్జి లకి కేకేత్తనారు అనుకుంటుంటే విస్తు పోవడం నా వంతయ్యింది.
తెలుగులోనే కాదు మన లొకల్ ఇంగ్లీష్ పేపర్లలో మన వాళ్ళు వేసే అడ్వటైజ్మెంట్లలో తప్పులు గ్రహించండి. కొన్నేళ్ళ క్రితం హిందూ పేపర్లో విజయవాడ "భామ" షాపు వాళ్ళు ఇచ్చిన ప్రకటన : లక్కీ ద్రాలో Neckless ఫ్రీ అని. మరి మన పీక కోసేవారేమో తెలీదు, అక్కడ వస్తువులు కొంటే!!
chala bagundandi ee post....nizamga chala ahladakaram ga undhi!!!
Post a Comment