ప్రకృతి లో అంతులేని వింతలున్నాయి..వాటిని మరింత అందంగా చూపగలిగే నేర్పరితనం ఆ ప్రకృతిలోంచి ఉద్భవించే అనంత జీవకోటి కి వెన్నతో పెట్టిన విద్య. ' The evolution cycle' నడుస్తూ ఉండాలంటే ప్రతి జీవి మరొక జీవి మీద ఆధారపడాల్సిందే. అది జీవనోపాది కోసం కావచ్చు, తోడు కోసం కావచ్చు, పొట్ట తాపత్రయం కోసం కవచ్చు, మరి దేనికైనా కావచ్చు.
ప్రతీ రోజు, ప్రతి జీవి తన పొట్ట పోసుకునే ప్రయత్నం చేయాల్సిందే.. చేస్తుంది..
తన జీవనోపాధికై పరుగులిడుతున్న ఆ జీవి పడే ఆరాటం, వేట కోసం ఎదురుచూపు,అనుకున్నది దొరికినప్పుడు తను అనుభవించే ఆనందం..ఇటువంటి భావాలన్నీ ఎంతో అద్భుతమైనవి..అనిర్వచనీయమైనవి.. మనం ఎప్పుడో ఒకప్పుడు తప్పకుండా చవి చూసే ఉంటాం.... చూస్తూ ఉంటాం!
నిత్యం జరిగే ఆ అద్భుతం ఒకటి నా దృష్టికి వచ్చింది..
కాకినాడ కి సమీపాన ఉప్పాడ అనే ఒక ఊరు ఉంది. ఉప్పాడకు వెళ్ళే దారి వెంటే సముద్రము మన తోడు వస్తుంది. ఎక్కువగ జనసంచారం లేని చోటు కావటం వలన, మనిషి సృష్టించే కాలుష్యానికి ఇంక ఈ సముద్ర తీరం లోనవ్వలేదనే చెప్పాలి. ఇప్పుడిప్పుడే దేన్ని ఒక 'ప్రైవేటు బీచూ కింద జమ కట్టి కొద్ది కొద్ది గా జన సంచారం పెరుగుతోంది..ఐనా గుడ్డిలో మెల్ల ..మహా వస్తే మామూలు రోజుల్లో ఐనా ఉప్పాడ జనం లేక రోజు వారి పన్నుల్లోంచి తీరిక చేసుకొని మరీ వచ్చే కాకినాడ పట్టణ జనం. అది రోజు జరగదు కాబట్టి, ఇంచు మించు ప్రశాంతం గానే ఉంటుందని అనుకోవచ్చు.
ఈ సారి క్రిస్మస్ సెలవులకి కాకినాడ వెళ్ళాను. ఎలాగూ సముద్ర తీరానికి వచ్చాము కదా అని..అదేదో పాటలో అన్నట్టు..'తొలి సంధ్య వేళలో.. తొలి పొద్దు పొడుపు లో..తెలవారే తూరుపులో.. వినిపించే భూపాల రాగం కోసం సముద్ర తీరాన సూర్యోదయం తిలకిద్దామని బయల్దేరాను..
డిసెంబరు నెల..పొగ మంచు, చిరు చలి..ఐనా సాహసించి..నీళ్ళలో పాదాలు మునిగే వరకు దిగి, కాసేపు ఆ అలల తాకిడికి ఈ ప్రపంచాన్ని మరిచి మరో లోకాల్లోకి వెళ్ళిపోయాను.
ఆ అనుభూతిని అలాగే ఉండనిద్దామనే ఉద్దేశ్యంతో కాసేపు అలాగే ఆ ఇసుక మీద కూర్చుండిపోయాను. మెల్లగా లేత ఎరుపు రంగు మిన్నునంటుతుంటే..దూరంగా ఒక నావ కనిపించింది..ఆహా.. సూర్యోదయానికని వస్తే ఇంకో వింత ప్రత్యక్షమవుతోందే అనుకున్నాను.
ఎదిగే భానుడితో, పెరిగే కిరణాలతో పాటే నావ కూడా ఒడ్డు కి చేరువలోకి వస్తోంది..దగ్గరగా వస్తున్న కొద్దీ, అలవోకగా ఒక పాట వినిపించింది..
హైలెస్సా ఏలో హైలెస్సా..
హైలెస్సా ఏలో హైలెస్సా..
ఏటికి ఎదురెల్తాం కడలిలో కాపురముంటాం
నావనంత వేటతో నింపి విందులకు అందిస్తాం
హైలెస్సా ఏలో హైలెస్సా..
హైలెస్సా ఏలో హైలెస్సా..
ఆకసమొకవైపు సంద్రమేమో ఒకవైపు
కలిసుండే కడలి అంచు మా వేటకు ఊపునిచ్చు
హైలెస్సా ఏలో హైలెస్సా..హైలెస్సా ఏలో హైలెస్సా..
పున్నమి వెన్నెలొచ్చినా కారుమబ్బు కమ్ముకున్న
సుడిగాలి కొట్టుకొచ్చినా ఆగదె మా వేట
హైలెస్సా ఏలో హైలెస్సా..
హైలెస్సా ఏలో హైలెస్సా..
నావలోని చద్ది కూడు మూన్నాల్ల ముచ్చటాయే
ఆలుబిడ్డలెదురు చూపు మాలోని ఆకలి నింపు
హైలెస్సా ఏలో హైలెస్సా..
హైలెస్సా ఏలో హైలెస్సా..
ఎవరికి భయపడము దేనికి తలవంచం
కడలి వొడిలోన తరతరాల బిడ్డల
మ్హైలెస్సా ఏలో హైలెస్సా..
హైలెస్సా ఏలో హైలెస్సా..
చిరు చేప పట్టినపుడు ఒల్లంత పులకింత
వంజరాల సింగారలె పడవల సోయగాలు..
హైలెస్సా ఏలో హైలెస్సా..
హైలెస్సా ఏలో హైలెస్సా..
హైలెస్సా ఏలో హైలెస్సా..
హైలెస్సా ఏలో హైలెస్సా..
ఒళ్ళు గగుర్పొడిచింది నాకు..కధలలో చదివాను కాని.. ఇదే మొదలు ఇల నిజంగా చూడటం..కళ్ళలో నీళ్ళూ తిరిగాయి..చేతిలో ఎటువంటి ఆధునిక పరికరం లేదు.. మనసు కెమేరాలో నేను చూసిన ఆ అద్భుత దృశ్యం, భద్రంగా దాచుకున్నాను..
అటు నావ వొడ్డుకు చేరుకుంటోంది.. వొడ్డున కొంత మంది జాలరులు ఉన్నారు..వారు రాత్రి వేసిన వలని వోడ్డుకి లాగుతున్నారు.. దాదాపు 50 మందికి పైగా ఉన్నారు. ఇరు వైపుల బారులు తీరి..పాట పాడుతూ వల లాగుతున్నారు....ఇటు తమకు అలుపు తెలియకుండా, అటు పక్కనున్న వారిని ఉత్సాహపరుస్తూ, వేట దొరికిందనే ఆనందాన్ని తమలో తాము పంచుకుంటూ పాడుకుంటున్నారు
ఇంతలో వొడ్డుకి వస్తున్న వల పైకి, రాబందులు, కాకులు, గెద్దలు, వగైరా పక్షి సమూహమొకటి ఎక్కకిడినించో ప్రత్యక్షమైంది..ప్రకృతిలో inherent గా ఉన్న silent communication! వాటికెవరికి చెప్పారు? fresh వేట కోసం అవి సిద్ధమే..మా వంతు అనుకుంటూ పిలవని పేరంటాలై వేంచేశాయి..వేట ని ఎక్కడ ఎంగిలి చేస్తాయొ అని.. జాలరులలో కొంతమంది కుర్రాళ్ళు ముందుకి దూకి వాటిని తరిమి కొట్టే ప్రయత్నం చేస్తున్నారు..
కాలమెలా గడిచిందో అస్సలు తెలియలేదు.. రాత్రి వేటకు వెళ్ళిన నావ వొడ్డుకి చేరుకుంది.. ఈ లోపున వొడ్డున ఉన్న జాలరులు కూడా వలని పూర్తిగా లాగేశారు. చేపలని సైజుల వారీగా వేరు చేసి బుట్టలకెత్తుకొని ఇవతల వైపు కట్టి ఉన్న యెడ్లబండ్లలో వాటిని పెట్టుకొని ఇళ్ళ వైపు పయనమయ్యారు.. అలుపెరుగని ఆ అలల బిడ్డలు..
P.S. వాళ్ళు పాడిన పాట పదాలు నాకు సరిగ్గా అర్ధం కాలేదు...ఐనా ఆ అనిర్వచనీయమైన అనుభూతి మీతో కూడా పంచుకుందామనిపించింది...బ్లాగు పూర్తిచేయటనికి..వారి పాట బహుశా ఇలానే ఉంటుందనే ఊహ తో...జానపద గేయాలలో జాలరుల పాటొకటి వెతికి ఇక్కడ రాశాను. గేయ రచన శ్రీ. హరి జగన్నాధ్ గారు.
P.S. వాళ్ళు పాడిన పాట పదాలు నాకు సరిగ్గా అర్ధం కాలేదు...ఐనా ఆ అనిర్వచనీయమైన అనుభూతి మీతో కూడా పంచుకుందామనిపించింది...బ్లాగు పూర్తిచేయటనికి..వారి పాట బహుశా ఇలానే ఉంటుందనే ఊహ తో...జానపద గేయాలలో జాలరుల పాటొకటి వెతికి ఇక్కడ రాశాను. గేయ రచన శ్రీ. హరి జగన్నాధ్ గారు.
3 comments:
మీ టపా చాల బావుంది అండి..
నేను విశాఖపట్నం లో చదువుకునే రోజుల్లో ఇలాంటి దృశ్యాలు రోజు చూసేవాళ్ళం..
రోజు బస్సులో సముద్ర తీరం వెంబడి ప్రయాణిస్తూ..
సముద్రాన్ని సూర్యోదయాన్ని చూస్తూ వుంటే చాల ఆనందంగా వుండేది..
ఆరోజులన్ని ఒక్కసారి గుర్తు వచ్చాయి మీ టపా చదువుతూ వుంటే..
మీ అనుభూతుల్ని ఎంత బాగా అక్షరాల్లో పెట్టారండీ..!
అంత మధురానుభూతుల్లో నేనూ విహరించినట్టుగా అనిపిస్తుంది.. మీ పోస్ట్ చదివాక..
చాలా బాగా రాసారు.. మరిన్ని చక్కటి అనుభూతుల్ని పంచుతారని ఎదురుచూస్తుంటాను :)
please remove 'word verification' option.
చాలా బాగా వ్రాసారు.
Post a Comment