Friday, November 9, 2018

శరదృతువు


'ఎచటినుండి వీచెనో చల్లని గాలి..' పాట వినిపించింది.
వనజ కళ్ళు నలుపుకుంటూ నిద్రలేచింది. తను అయిపాడ్ కి జతపరచినఅలారం అది. మన మామూలుగా వినిపించే 'ట్రింగ్.....’కాకుండా, ఇలా పాటలు కూడా పెట్టుకోవచ్చు; అని తను తెలుసుకున్న రోజు మహా సంబరపడిపోయింది.  ఇంతక మునుపు, ‘ఎప్పుడు మోగుతుందా ?, ఎందుకైన మంచిది, శబ్దం వినపడి,  కలలు చెదరకముందే లేద్దాం అనే ఆలోచనతో, అసలు కలలే కనలేని అప్రమత్తంగా ఉండే రాత్రులకిక సెలవనుకుంది!
పైపెచ్చు హాయైన పాటలతో మేలుకొలుపు ఎవరికి రుచించదు? పద్ధతి కనిపేట్టినప్పటినించీ అన్నీ 'రసాలూరి (సాలురి రాజేశ్వర రావు గారి) ఉదయాలే! వనజ సాలూరి వారి పాటలంటె చెవి కోసుకుంటుంది మరి!
అప్పుడే అయిదైందా ?”, అనుకుంటూ నిద్ర లేచింది. కాలకృత్యాలు తీర్చుకొని, గబా గబా వంటింట్లోకి వెళ్ళింది, కుక్కర్ పెట్టడానికి! కిట్టు గాడి స్కూల్ బస్ పావుతక్కువ ఏడింటికి వచ్చేస్తుంది. వాడికిష్టమని ఇవ్వాళ  పులావ్ చేద్దామని పూనుకుంది. అందుకే తను యధావిధిగా వెళ్ళేమార్ణింగ్ వాక్ కూడా మానుకుంది. ‘పులావ్ అంటే మరి కొంచెం ముందొస్తు తయారీ కావాలి కదా? చక చకా పనిలో పడింది. తాలింపులోఖారాలు, మిరియాలు గట్రా వేస్తూ, మనసులోఅయ్యొ అన్నట్టు చిన్నది ..(తన గారల పట్టీ మేఘన) ఘాటు ఎక్కువైతే తినలేదు, పైగా వదిలెస్తుంది?”, అని గ్రహించిన 'అమ్మమనసు, చేతిలోంచి సగం మసాలా దినుసులే రాల్చింది మూకుడిలోకి !
అంతలోనే, తనలోని శ్రీమతి నిదురలేచింది.." ఆయనగారికి ఒక రెండు మిరపకాయలు వెయించి చివరన సద్దేస్తే సరి!” అనుకుంది చిలిపిగా, శ్రీవారిని తల్చుకుంటూ! నారీమణులకి మల్టీటాస్కింగే కాదు మల్టీథింకింగు కూడా వచ్చును సుమండీ. అందులో మన వనజ దిట్ట!
లంచ్ బాక్సులన్నీ గబ గబా సద్దేసి, కాఫీ కి డికాషన్ వేసి, కిట్టూ గాడిని నిద్ర లేపడానికి వెళ్ళింది. వాడు అటు నీలిగి, ఇటు నీలిగి, తిన్నదేదో తిని, హడావుడి పెట్టి, చివరికి పాలు తాగకుండానే తుర్రుమన్నాడు! "అబ్బా, వీడిని రేపటినించి ఒక పది నిముషాలు ముందు లేపాలి " అని పళ్ళు నూరుకుంది వనజ.
కాని తల్లి గుండే సీతయ్యJ ! అది తన మాట వినదు. అది ఎప్పుడూ ఇంకోలా ప్రతిస్పందిస్తూ ఉంటుంది. మరునాడు యధావిధిగా జాలి నిండిన తల్లి గుండె, ‘పోనిలే కాసెపు పడుకోనీ అనుకుని ప్రయత్నం మానుకుంటుందని తనకి తెలుసు ! అదే లాలి పాట ఆలాపనలో గమత్తు!
ఒక విరక్తి నవ్వొకటి లీలగా నవ్వుకొని, ఒక కప్పు కాఫీ కలుపుకొని, రాత్రి మిగిలిన చపాతీ ముక్కకి కాస్త మిరపళ్ళ కారం పూసి, టీవీ ముందు కూర్చుంది వనజ.  టీవీ ఫైవ్ లో 'ఫేవరెట్ ఫైవ్అనే కార్యక్రమంలో రోజు వంతు ' స్వర రాజేశ్వరుడిది. ఆయన  మీదనే ప్రోగ్రాము. “ఆహా, ఇదియే కదా భాగ్యమనిన”, .. అనుకొని, ఇంకొన్ని పాటలు విని--చూసేసింది హాయిగా!
 కారం- తీపి-చేదు అన్ని రకాలుగా (అంటే.. కాఫీ-పచ్చడి- చపాతీ కాంబినేషన్ తో జిహ్వకి; హేమాహేముల వంటి నటుల అభినయం - అద్వితీయమైన సంగీతం కాంబినేషన్ తో మనసుకీ..) అస్వాదించేసింది కాసేపట్లో! ఇంతకంటే అహ్లాదకరమైన ఉదయం ఉంటుందా? అనుకుంది. “ఇటువంటి చిన్న చిన్న విషయాలు ఎంతో ఆనందాన్నిస్తాయి. వాటిని ఆస్వాదించడం చేతనవ్వాలి అంతే. ఉదయాన్నే మనసు హాయిగా ఉంటే, రొజంతా ఎంతో ప్రశంతంగా గడిచిపోగలదు. కాలజ్ఞానసార ప్రకారం ఇవి మనోల్లాసినికి అవసరమని అనిపించటం మానేశాయి మనుషులకి ! అదే విచిత్రం!”, అనుకుంది వనజ.
చిన్న సైజు ఆత్మ  త్రుప్తితో లేచి, మేఘనను లేపి స్కూల్ కి తయారుచేయడానికి పూనుకుంది. నీళ్ళు పోసి, జెడలు వేసి, ఆన్నం పెట్టి, బస్ ఎక్కించి కార్యక్రమం కూడా అయ్యిందనిపించింది. సాకేత్ ఆఫీస్ కి తయారయ్యి బయల్దేరుతూ, "ఏమిటొయ్, ఇవ్వాళప్రత్యేకం? పులావ్ చేసినట్టున్నవ్?”,  అంటూ కళ్ళెగరేశాడు. “మీ పుత్ర రత్నం నిన్న పరీక్షలో మాంచి మార్కులతో ఉత్తీర్ణుడయ్యాడు కదా? అదీ విశేషం. ఇష్టంగా తింటాడని చేశానండీ. చాలా కష్టపడ్డాడు కదా మరి”,అని జవాబు ఇచ్చింది.  అలాగైతే వాడికిష్టమైన గులాబ్ జామున్ కూడా చేసేయి పనిలో పని, స్వామి కార్యం స్వకార్యం రెండూనూ ..! అని నాలిక కరుచుకున్నాడు, వనజ స్పందన కోసం ఓరగా చూస్తూ”. “నిజం ఒప్పుకున్నందుకు తప్పకుండా చేస్తాను”, అని ముసి ముసి నవ్వులు నవ్వుకుంది వనజ.
సాకేత్ ఆఫీసుకి వెళ్ళాక, తను స్నానం చేసి, దేవుడి దగ్గర దీపం పెట్టి, కాలేజీకి బయల్దేరింది.
బయట శరద్రుతు శోభలుఅంతని, ఇంతని చెప్పనలవికాకున్నాయి. చెట్లన్నీ పట్టుచీరలు కట్టిన పండు ముత్తైదువుల్లా కళకళలాడుతున్నాయి. పొగమంచులు వీడని రోడ్లు, రాలిన ఆకులతో ఆహ్లాదంగా స్వాగతం పలికాయి. అందునా, కార్తీక మాసం కావటం తో ఒకలాంటి దైవికమైన వాతావరణంగా ఉంది ఊరంతా.
బండి నడుపుతూ చుట్టూ ఉన్న ప్రకృతిని గమనిస్తోంది వనజ. పదేళ్ళుగా తను చూస్తున్న దారే! కానీ బయటికి వస్తే కాని, కనిపించని శరద్రుతు శోభలను చూసి ముగ్ధురాలయ్యింది. “పని హడావుడిలో పడి ఇవన్నీ ఎంత మిస్సయిపోతున్నానొ, ప్చ!”, అని నిట్టూర్చింది. 
వనజ మధ్యనే తన కొత్త ఉద్యోగంలో చేరింది. పొద్దున్నే ఎనిమిది గంటలకి వెళ్ళి సాయంకాలం నాలుగింటికి పిల్లలు ఇంటికి చేరేవేళకి వచ్చేస్తుంది. ఇంతకు మునుపు ఒక పార్టయిం ఉద్యోగం చేసేది. అదీ పిల్లలింకా చిన్నవాళ్ళని, వాళ్ళతో ఎక్కువ సమయం గడిపేది. అవసరం కూడా! ఉద్యోగం కేవలం ఒక వ్యాపకం. చదివిన చదువుకి ఒక సార్ధకత అనుకుంది అప్పట్లో. ప్రస్తుతం పిల్లల్దు పెద్దవాళ్ళై కొంత బిజీ అయ్యారు. మధ్య తరగతి ఆర్ధిక కష్టాలు చెప్పనేల?  అని అవకాశాన్ని సద్వినియోగ పరుచుకుంటూ ఫుల్టయిం ఉద్యోగం లో చేరింది. ఒకప్పుడు తన జీతం వేణ్ణీళ్ళకి చణ్ణీళ్ళలా తోడు. కానీ ఇప్పుడు ఎదుగుతున్న పిల్లల పై చదువులకి అవసరమైన రాబడి.
అందుకని కొంత కాలం క్రితం వరకూ ఇంత పని వత్తిడి లేదు. పొద్దున్నే పిల్లలని స్కూళ్ళకి పంపేసి చుట్టుపక్కన ఉన్న సమవయస్కులైన అమ్మలందరూ బాతాఖానీ వేసుకునేవారు. సరదాగా అలా మార్ణింగ్ వాక్ కి వెళ్ళేవారు ఒక నాలుగు కిలోమీటర్లు. వస్తూ సరుకు సామాగ్రీ కొని, ఎవరి ఎవరి పనుల్లో వాళ్ళు మునిగిపోయే వాళ్ళు. సాయంత్రాలు కూడా సరదాగా గడిచిపోయేవి. పిల్లలతో, వాళ్ళ పనులతో ఎప్పుడూ ఎదో ఒక హడవుడి పండగలా ఉండేది. అమ్మలక్కలతో ముచ్చట్లు, పిల్లల ఆటలు, సామూహిక భోజనాలు ఇలా ఎన్నో సందడి రోజులు.
సరదా రోజులు గుర్తొచ్చాయి తనకి దారి వెంటవెడుతుంటే! అప్రయత్నంగా కళ్ళవెంట నీళ్ళు కూడా తిరిగాయి. పిల్లలు పెద్దవాళ్ళయి ఎవరి పనుల్లో వాళ్ళు మునిగిపోయారు. అందరు ఏంటో తెలియని ఒక వింత పరుగు పందెంలో భాగస్వాములైపోయారు ఒక్కసారిగా! ఎన్నో ఆలోచనా తరంగాలు తనని చుట్టుముట్టాయి. తీయని జ్ఞాపకాలే వాటికి పునాది! “అగాధమౌ జలనిధి లోనే ఆణిముత్యమున్నటులే, శోకాన మరుగున దాగి సుఖమున్నదిలే.." అని కార్ స్టీరియో లో పాట తోడవటం తో ఒక్క క్షణం అంతర్ముఖురాలయ్యింది వనజ .
జీవితం ఎన్ని మలుపులు తిప్పుతుందో కదా ? పరిస్థితుల బట్టీ, అవసరాలను బట్టి ఏర్పడేవే, వ్యాపకాలు!, కొత్త దారులు! అందులో భాగంగా చిరు త్యాగాలు. ఎప్పుడూ జీవితం ఒకేలా ఉండాలి అనుకోవటం అవివేకం! తన విషయానికొస్తే పార్టయిం ఉద్యోగం చెసినప్పుడేమో నా చదువుకి తగ్గ పారితోషకం అందట్లేదనో, లేక ఇంతకంటే గౌరవం గా, చదువుకి తగ్గ హోదాలో ,అందరూ తనని గుర్తించేలా, బతకలిగితే బావుణ్ణు అనుకున్న క్షణాలూ లేకపోలేదు! కాని, చదువుకుని ఇంటికి పరిమితమైపోయిన ఎందరో తల్లుల్లా , పిల్లలే ప్రపంచమనుకుంది కొన్నాళ్ళు.
స్వతహాగా ఖాళీ గా కూర్చునే తత్వం కాకపోవటం తో ఏదో ఒక ఉపయోగ పడే పని, తన వల్ల నలుగురికీ ఉపయోగపడె పని చేసింది పార్టయిం జబ్ గా. పక్కనే ఉన్న కాలేజీ గ్రంధాలయం లో పర్యవేక్షణా విభాగంలో ఒక చిరు ఉద్యోగిగా సేవలందించింది. తను బిజినెస్ ఎడ్మినిస్తేషన్ లో దిస్టింక్షన్ లో పాస్ అయినా మాత్రం చిన్నతం అనుకోలేదు.
మధ్య అనుకోకుండా వచ్చిన  ఒక సదావకాశాన్ని, దేవుడిచ్చిన అదృష్టం గా భావించి మరోసారి కాలదన్నుకోలేక తన చదువు కు తగ్గ ఒక ఉన్నతాధికర వృత్తి చేపట్టింది. దారిలో నడవటానికి కొన్ని చిరు త్యాగాలు చేయకతప్పలేదు మరి.  తను కోరుకున్న జెవితమే కదా ఇది. ఆలోచించి వేసిన ఆడుగులే కదా ఇవి. మరి ఏదో కోల్పుతున్నట్టు ఎందుకీ ఆవేదన? అవ్వా బువ్వా రెండూ  కావాలంటే ఎలా? సున్నితంగా  నిట్టూర్చింది వనజ. మళ్ళీ నా దన్న శరద్రుతువు ఎప్పుడో? అనుకుంటూ కార్యోన్ముఖురాలై ముందుకు సాగింది.
రుతుక్రమమనేది ఎంత సహజమో జీవితంలో ఆనందం దుఖం అనేవి కూడా అంతే సహజం. అవి చుట్టపు చూపుగా వచ్చిపోతుంటాయి.
వనజ లాంటి ఎందరో మాతృమూర్తులు రాబోయే శరదృతువు కోసం ఆనందంగా గ్రీష్మ వర్ష రుతువులను ఎదురుకుంటారు. వారికి నమస్సుమాంజలి.

3 comments:

Subba Reddy said...

ఆలోచనల దొంతరలకి అందంగా రూపు నిచ్చారు. చాల బాగుందండి.

Unknown said...

nice article

Unknown said...

చాల బాగుందండి