Thursday, November 15, 2018

పునాది రాళ్ళు


టైటిల్: పునాది రాళ్ళు

                                క్యాప్షన్: పెద్ద హీరో మొదటి సినిమా స్టోరీ కాదు..!

వివాహ బంధానికి నూరేళ్ళు హాయిగా వర్ధిల్లడానికి ముఖ్యంగా కావల్సినవి ఒకరిమీద ఒకరికి 'నమ్మకం, గౌరవం'...అంది బాపు-రమణలపెళ్ళి పుస్తకం.

అఫ్కోర్స్ పాయిరం, అక్కర కూడా కావల్ననుకోర్రి..

వీటన్నిటితోపాటు ఇంకా ముఖ్యంగా కావల్సినవి మన పునాది రాళ్ళు’..!!

ఒక సుమీత్ మిక్సీ, ఒక ప్రెస్టీజ్ ప్రెస్షర్ కుక్కర్, ఒక ఇస్త్రీ పెట్టి, వేయటం వచ్చినా రాకున్నా..ఒక అట్ల కాడ, ఒక దోసెల పెనం ఇద్దరి పేర్లున్న ఒక నేం ప్లేట్...వాకిలికి ఒక వాడని తోరణం!

చిన్నా చితకా లిస్ట్లో ఒక హస్తం, ఒక చాప, ఒక పులుస్ గరిటె, ఒక పెరుగు గిన్నె..ఒక బుడ్డి.., ఇలా ఇంకా చాలా ఉన్నయి.. కానీ పునాది రాళ్ళ నిజంగా పునాదికి సోపానాలే..
కారణం మెల్లగా మీకే అవగతమవుతుంది.~!
[ఈ చిన్న చితకా లిస్ట్ లో ఏమైన పోయినా కొంత పాటి తేలిక హృదయంతో కొనుక్కోగలమేమో కానీ, పునాది రాళ్ళల్లో ఏ ఒక్కటి పోయిన ఇంక అంతే సంగతులు..[.. అదే అదే బ్రాకెట్ ఎటు వైపున మూయాలో కూడా తెలియని అయోమయం లో పడతాం అన్నమాట! ]

నిన్న ఒక చిన్న సైజు ఘోర ప్రమాదం జరిగింది.. మదర్స్ డే వస్తోంది కదా.. నీకు ఎందుకోయ్ శ్రమా ..చూడు నా ఇస్త్రీ నేనే ఎంత చక్కహా చేసుకుంటానో అని.. నాకు  పని తగ్గించేద్దామని మా శ్రీవారు విజ్రుంభించి.. ఇస్త్రీ కి రంగం సిద్ధం చేసుకున్నారు..(ఆ అంతా ఉత్తిదే.. చేయి ఖాళీ లేక ఒక నాలుగు బట్టలు ఎక్కువ చేరాయి డ్రమ్ములో.. రేపేమో ఆఫీసులో పై అధికారులొస్తున్నారు తనిఖీకి...అదీ ట్రూ స్టోరీ..: నే చెప్పానని చెప్పకండీ! ఉష్ష్ గప్ చుప్ సంబార్ బుడ్డీ..!)

మగవారు మార్స్ నించి దిగారని.. ఆడవారు వీనస్ నించి దిగారనన్నీ ఎపుడో.. ఎక్కడో చదివిన జ్ఞాపకం!
వీరు ఆలొచనా తీరు వారికర్ధంకాదు.. వారి పని చేసే వైనం వీరికర్ధం కాదోచ్! అది నార్మల్! నథింగ్ టు వరీ అబౌట్!

వంకర టింకరగా ప్లగ్ లో వైరు వేళ్ళడుతూ అలాగే అతి జాగ్రత్తగా తంటాలు పడుతూ ఇస్త్రీ కానిస్తున్నారాయన. దీనికి తోడు ఇన్స్పిరేషన్ కోసం టివీ లో లెజెండ్సినిమా ఒకటి మాకు బ్యాక్గ్రౌండ్ మ్యూసిక్ లా..!
మా బాబ్జీ గాడి నలిగిపోయిన లాల్చీ ఒకటుందని గుర్తొచ్చి.. అదొక్కటీ నే చేస్తానని..మధ్యలో దూరను నేను.. (అలా పని మధ్యలో అడ్డు పడకూడదని తరవాత తెలిసింది!) ఆ వంకర టింకర సామ్రాజ్యం లో నేను ఇమడలేకపోయానని ఇస్త్రీ పెట్టి తేల్చేసింది! ఢాం అని పెద్ద శబ్దం చేస్తూ నేలకొరిగింది- తాను కూచ్చున్న కొమ్మని తానే నరుకున్న చందంగా తన వైరు తనకే అడ్డొచ్చి! ఇటు వంటింట్లోంచి నచ్చని వాసనేదో వచ్చింది...మాడిపోయిన బెండకాయ కూర కావాలు..! ముల్లు పోయే కత్తిపోయే ఢాం ఢాం ఢాం~

ఆ బుంజీ జంప్ చేశాక ఎంత ప్రయత్నించినా మా ఇస్త్రీ పెట్టె వేడెక్కనని మొరాయించింది. 
ఒక పునాది రాయి.. హయ్యో..
నేను హైదరాబద్ వచ్చినప్పుడల్లా మా ఆస్థాన ప్రెస్టిజి వాడు ఎక్ష్చేంజ్ ఆఫర్ అని ఎన్ని సార్లు చెవులుహోరెత్తించినా - నా కుక్కర్ ని మార్చలేదు.
ఎంతో మధన పడి ఒక సారి బేస్ అరిగిపోయిందని మార్చడానికి బయల్దేరాను. మధ్య దారిలోనే మా రాజలింగం ఆటోని వెనక్కి తిప్పించేశాను. హ్యాండిల్ పీకేస్తే కనీసం ఏ ఇడ్లీ పిండి కో పనికివస్తుందనే పునరావాస తలంపుతో!

ఫతేమైదాన్ క్లబ్ దగ్గరున్న సుమీత్ మిక్సీ వాడైతే నన్ను ఏకంగా గుర్తు పెట్టేసుకున్నాడు. మిక్సీ జార్లకి స్పేర్లు  కొన్నాననే కాదు.. వ్రతి లాగ దాన్నొకసారి సర్వీసుకి తీసుకెళ్తూ ఉంటాను.. మా తాతయ్య స్కూటర్ కి ఆయిల్ చేంజ్, స్పార్క్ ప్లగ్ క్లీనప్ లాగా..! అమ్మా ఇది మీ మనవల కాలం దాక కూడా ఏ ఢోకా లేకుండా పని చేస్తుంది మీరు చూపుతున్న శ్రద్ధకి అని హామీ ఇచాడు మా మల్లేస్!

ఎందుకైన మాంచిదని ఒక తాయత్తు కూడా కట్టాను దానికి!
అన్నట్టు మర్చిపోయాను,., ముఖ్యంగా చెప్పల్సిన సంగతి.. మా అట్లకాడ గురించి..
అది ఒక సారి చేయి జారి పక్కనే ఉన్న ఫ్రిడ్జి కింద పడింది. అంతటి ఫ్రిడ్జిని కదపటం నా వల్ల కాలేదు. మా మామగారిని సాయం అడిగాను భయం భయంగా.. అదొక మాయబజార్ పెను మాయ..! కదల్చటం ఎవరి తరం కాదు.
ఏంతో ఓర్పుగా నేర్పుగా ఇనప హ్యంగరు సాయంతో పాపం ఆయనే తీసి పెట్టారు.. అప్పటినించి గట్టుకి దానికి ఉన్న సందులో రోకలి బండ ఒకటి అడ్డుగా పెట్టాను.. మళ్ళీ ఆ ప్రమాదం జరగకుండా..

ఆ ఫ్రిడ్జి కింద సిధిలమైపోయిన ఒక ఎలక గారి కళేబరం ఒకటి తవ్వకాల్లో బయట పడింది..

అప్పుడెప్పుడో వచ్చిన ఆ కంపు వాసన ఇద్దన్నమాట అనుకున్నాం అందరం అది గుతొచ్చిన్నందుకు ముక్కున వేలేసుకొని ! ఇలాంటి వింతలు జరగటమూ మామూలే కదా..?

మా వాడని తోరణం (ఊలు తో అల్లినది- దానికి చిన్న చిన్న గంటలు కూడా వేళాడుతుంటాయి.) నా బెస్ట్ ఫ్రెండు మా పెళ్ళికి ప్రెజెంటేషన్ ఇచ్చింది. పండుగ నాడు మామిడి తోరణాలు కట్టుకున్నప్పుడల్లా దాన్ని భద్రంగా లోపల పెట్టేస్తాను.ఎండకి దాని కొన్ని రంగులు వెలిసినా.. మళ్ళీ అదే పెట్టేసుకుంటుంటాను..
మరి నేం ప్లేట్ సంగతో..? .. దాని వెనుక ఏడు తరాల సాలీడ్లు కాపురం ఉన్నాయి.. ప్రస్తుతం ఎనిమిదవ తరం నడుస్తోంది..
మా చంటిది మొన్న ఆదిగింది.. 'అమ్మ, ఇది శుభ్రం చేసి ఒక సారి మళ్ళీ పయింట్ వేయిస్తేనో? అని..అబ్బే.. ఆ సాలీడు పాపల ఆటా పాటకి అంతరాయమున్ను.. ఆ తల్లి తండ్రుల కలల చెదిరిపోవటమూ ఒకే సారి జరిగిపోతాయి.. అంచేత ఆ ఆలోచన విరమించుకుందామన్నాను... సాలోచనగా..ఆవులిస్తూ..😶

ఇవి పునాది రాళ్ళ కధ!

మొత్తానికి నా పునాది రాయి ఒకటి అలిగింది. దాని సంగతేంటో చూడాలి.. ఇవాళ్ళ! ఇన్స్టంట్ ప్రపంచంలో అన్ని యూస్ ఏండ్ థ్రో పాలసీ తో వస్తున్నాయి.. కానీ అంత తేలికగా చేతులెత్తేస్తామా? నో వే!

- సుష్మ విజయకృష్ణ


No comments: